తెలంగాణ అమ్మాయిలకు అపార అవమానం -

తెలంగాణ అమ్మాయిలకు అపార అవమానం

హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్ళు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. ‘తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా?’ అంటూ వారిని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి.

‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు’ అని ఆయన అన్నారు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ అయిన రామప్ప దేవాలయానికి వచ్చిన విదేశీ వనితలకు, తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కాళ్లు కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని కిషన్‌రెడ్డి విమర్శించారు.

చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో, రాణి రుద్రమదేవి పాలించిన గడ్డపై తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర’ అని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నారు.

అతిథి దేవో భవ అనే మన విధానంలో, అతిథిని గౌరవించే క్రమంలో, మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *